-బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్
కడప, ఆగస్టు 28: కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డులో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ శుక్రవారం సాయంత్రం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు కాలనీలు, వీధుల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీరు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, దెబ్బతిన్న రహదారుల సమస్యలను పవన్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పవన్ కుమార్ మాట్లాడుతూ 9వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు తనను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గెలిచిన రెండు నెలల్లోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి మురుగు కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం, నాణ్యమైన రహదారులు, నిరంతర తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులను కల్పిస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ శంకర్, కృష్ణారెడ్డి, కంబగిరి, గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రమణారెడ్డి, రాము, కుళ్లాయప్ప, నాగేశ్వర్‌రెడ్డి, మావల్లి షేక్, కార్తిక్, కిషోర్, ముజషీర్ తదితరులు పాల్గొన్నారు.