కడప జూన్18 (కడప మనస్సాక్షి ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం కడప నగరంలోని పుత్తా ఎస్టేట్‌లో “రాష్ట్రంలో రెండేళ్ల పాలన, నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” పై ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత , జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గ మాట్లాడుతూ, కడప జిల్లాలో సుమారు 4,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు సుమారు రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
విద్య, ఉపాధి, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో కడప జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.