రాష్ట్ర అభివృద్ధికి కడప జిల్లా కీలక భాగస్వామిగా మారుతోందని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న టాప్-10 జిల్లాల్లో నాలుగు జిల్లాలు రాయలసీమకు చెందినవే కావడం గర్వకారణమని, ప్రతి సంవత్సరం దాదాపు 10 శాతం వృద్ధి రేటుతో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు.
రాయలసీమ అభ్యున్నతి, పారిశ్రామిక వికాసం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవకల్పనలపై సమర్థ రీసెర్చ్ & రిసర్జెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైజింగ్ రాయలసీమ: ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ & ఇన్వెస్ట్‌మెంట్” సదస్సు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది.ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్యకుమార్ గారు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ గారు, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, ఎమ్మెల్సీ రామ్‌గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మాట్లాడుతూ, రాబోయే రెండు దశాబ్దాల్లో కడప జిల్లా పారిశ్రామిక, వ్యవసాయ, ఇంధన, పర్యాటక రంగాల్లో విశేష పురోగతి సాధించి దేశవ్యాప్తంగా ఆదర్శ జిల్లాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.