MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 12:26 pm Posted by : State Buearo

9వ వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

-కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్

కడప: కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డును అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం వార్డు పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార పర్యటన సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బత్తల పవన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ లోపం, చెత్త తొలగింపు, వీధి దీపాల సమస్యలతో పాటు పలు కాలనీల్లో సీసీ రోడ్ల మరమ్మతుల ఆవశ్యకతను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ మాట్లాడుతూ… గత పాలకులు వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. నిధులు రాబట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నాణ్యమైన రోడ్లు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 9వ వార్డును కడప నగరంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు ప్రముఖ నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, కృష్ణారెడ్డిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, వార్డు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.