- పీఠం ఒక్కటి.. ఆశావహులు ఎందరో!
కడప, మనస్సాక్షి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్లు, అసమ్మతి నేతల బుజ్జగింపులు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. కడప నగరపాలక సంస్థతో పాటు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు తదితర మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులను రాజకీయ బరిలోకి దించేందుకు నేతలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని చోట్ల ఆశావహుల మధ్య పోటీ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది.
కడప మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ
కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బండి దీప్తి అభ్యర్థిత్వాన్ని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికార కూటమి తరఫున అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గం, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వర్గం మధ్య అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులురెడ్డి కుమారుడు శ్రవణ్రాజ్రెడ్డికి అవకాశం కల్పించాలని ఒక వర్గం ప్రయత్నిస్తుండగా, అలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి కోడలు ఉమాదేవి పేరు కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్యే వర్గం ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పులివెందులలో ప్రతిష్ఠాత్మక పోరు
పులివెందుల మున్సిపాలిటీ అధికార కూటమికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ ప్రమీలమ్మ పేరు ప్రచారంలో ఉండగా, ఓసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ తరఫున గీతాకుమారిని బరిలోకి దించే అవకాశాలపై చర్చ సాగుతోంది. మరోవైపు బ్రహ్మణపల్లె వెంకటరామిరెడ్డి కుటుంబం నుంచి కూడా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అభ్యర్థుల ఎంపికతో పాటు స్థానిక రాజకీయ సమీకరణాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.
ప్రొద్దుటూరులో ఆశావహుల పోటీ
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనూ అభ్యర్థుల ఎంపిక అధికార తెలుగుదేశం పార్టీకి సవాల్‌గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరెడ్డి నరసింహారెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో పర్లపాడు మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, భూమిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి, ముక్తియార్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆశావహుల సంఖ్య పెరగడంతో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
జమ్మలమడుగులో కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు
జమ్మలమడుగు మున్సిపాలిటీలో దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల రాజకీయ ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఓసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో రెండు కుటుంబాలకు చెందిన మహిళలు బరిలోకి దిగే అవకాశాలపై ఊహాగానాలు పెరిగాయి. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయిస్తే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణమ్మ పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే కాటసాని జ్యోతి పేరు వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ పేరు చర్చలో ఉంది. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అభ్యర్థులపై స్పష్టత రానుంది.
రాజంపేటలో మారిన రాజకీయ సమీకరణాలు
రాజంపేట మున్సిపాలిటీలో బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. చైర్మన్ పదవిని ఆశించిన పలువురు నేతలకు రిజర్వేషన్లు నిరాశ కలిగించగా, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్ గాయత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న దొంతు శివప్రసాద్ కుమార్తెగా ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై చర్చ సాగుతోంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల శ్రీవాణి, జగ్గంరాజుపల్లె నాగజ్యోతి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది.
బద్వేలులో ఎవరివైపు మొగ్గు?
బద్వేలు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, ఆమె కుమారుడు రితీశ్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తల్లి లేదా కుమారుడిలో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన మాచనూరు సూర్యనారాయణరెడ్డి వర్గం వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక నాయకుల మధ్య సమన్వయం, అభ్యర్థి ఎంపిక ఇక్కడ కీలకం కానున్నాయి.
చిన్న మున్సిపాలిటీల్లోనూ గెలుపు వ్యూహాలు
యర్రగుంట్ల, కమలాపురం మున్సిపాలిటీల్లోనూ ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్థానిక నాయకుల సిఫారసులు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల వ్యక్తిగత బలం విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగకుండా చూడటం, అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం నాయకత్వానికి కీలకంగా మారింది.
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు
మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. రిజర్వేషన్ల ప్రభావం, కుటుంబ రాజకీయాలు, ఆశావహుల పోటీ, స్థానిక నాయకుల మధ్య సమీకరణాలు అభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. అధికార కూటమి మున్సిపాలిటీల్లో పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయ బలాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న అభ్యర్థుల పేర్లలో కొన్ని ప్రచార స్థాయిలోనే ఉండటంతో అధికారిక ప్రకటనల తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల ఐక్యత, స్థానిక సమస్యలపై ప్రచారం చివరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.
