– చిన్నమండెం మండలంలో రూ.5.20 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
– సీఎం చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో… గ్రామ గ్రామానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు
– అభివృద్ధికి కొత్త ఊపు…ప్రజల సంక్షేమమే లక్ష్యం
– గ్రామీణ మౌలిక వసతుల బలోపేతమే మంత్రి మండిపల్లి మార్క్
చిన్నమండెం, ఆగస్టు 3:(కడప మనస్సాక్షి ప్రతినిధి)
రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని… గ్రామీణ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.సోమవారం చిన్నమండెం మండలంలోని పలు గ్రామాల్లో రూ.5.20 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ఆరోగ్య సేవలను గ్రామస్థాయికి తీసుకురావడం, రైతులు, పశుపోషకులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా చిన్నమండెం మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు.
*ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వివరాలు:*
*▫️చిన్నర్సుపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం.*
*▫️పొలిమేరపల్లెలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం.*
*▫️దేవగుడిపల్లిలో రూ.16 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ ప్రారంభం.*
*▫️ఆర్ అండ్ ఆర్ కాలనీలో రూ.1.95 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభం.*
*▫️టీ చాకిబండ గ్రామంలో రూ.39 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం.*
*▫️ఏపీలవంకపల్లెలో రూ.1.55 కోట్లతో నిర్మించిన నూతన బీటీ రోడ్డు ప్రారంభం.*
*▫️చిన్నమండెంలో రూ.50 లక్షలతో నూతన పశువైద్య ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన మరియు భూమిపూజ చేశారు.*
ఈ పనులు పూర్తవడం ద్వారా గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు వైద్య, పశువైద్య సేవలు మరింత చేరువ అవుతాయని మంత్రి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. చిన్నమండెం మండల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని …అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరే వరకు తన కృషి కొనసాగుతుందని.. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
*ఘన స్వాగతం*
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజల కోసం గ్రామాలకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పూలహారాలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఆత్మీయంగా ఆహ్వానించగా, గ్రామాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రిని అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ కమిటీలు, బూత్, యూనిట్, క్లస్టర్ కమిటీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
