📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం – అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

📰 Generate e-Paper Clip

– ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ‘యోగాంధ్ర-2026’ వేదిక

మదనపల్లిలో వేలాదిమందితో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం

మదనపల్లి, జూన్ 08:( కడప మనస్సాక్షి)

యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర-2026″కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మదనపల్లి ఆర్టీసీ డిపో–1 సమీపంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు, యోగా శిక్షకుల మార్గదర్శకత్వంలో యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా అభ్యాసకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…యోగాంధ్ర-2026 ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా జిల్లా ముందడుగు వేస్తోందన్నారు. యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం సంతోషకరమని అన్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం యోగాపై వారి ఆసక్తి, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యోగాను ప్రజల జీవనశైలిలో భాగం చేయాలనే సంకల్పంతో “యోగాంధ్ర” కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత కూడా సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్‌కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జూన్ 11న హార్స్లీ హిల్స్ మరియు 14న బోయకొండలో కూడా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
యోగాను కేవలం యోగా దినోత్సవానికే పరిమితం చేయకుండా ప్రతిరోజూ ఆచరించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు యోగా ప్రాధాన్యతను ప్రజలకు వివరించి ఆరోగ్య చైతన్యాన్ని మరింత విస్తరించాలని కోరారు.
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అందుకే యోగాను ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల దైనందిన జీవనశైలిలో భాగం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు యోగా సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని, విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. నేటి పిల్లలే దేశ భవిష్యత్తని, ఆరోగ్యవంతమైన తరం దేశ అభివృద్ధికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యోగా శిక్షకుడు పాల్ బ్రహ్మకుమార్ పాల్గొన్న వారితో వివిధ యోగాసనాలు చేయించి వాటి ప్రయోజనాలను వివరించారు.
కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ హైమావతి, డ్వామా పీడీ వెంకటరత్నం, డీపీఓ రాధమ్మ, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, డీఎల్డీఓ లక్ష్మీపతి, డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, తహసీల్దార్ మాధవి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ సిబ్బంది, విద్యార్థులు, యోగా అభ్యాసకులు, వివిధ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!