– జూలై 14 వరకు ప్రతి ఓటరు వెరిఫికేషన్
– ప్రజలు ఖచ్చితంగా ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవాలి
గాలివీడు జూన్ 16 క(డప మనస్సాక్షి ప్రతినిధి)
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళన మరియు నవీకరణ కోసం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గాలివీడు మండల తహశీల్దార్ భాగ్యలత తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మ్యాపింగ్ పూర్తి చేయడం, తప్పులను సరిచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. నేటి నుండి జూలై 14 వ తేదీ వరకు మండల వ్యాప్తంగా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందని మంగళవారం బి ఎల్ ఓ ,బి ఎల్ ఏ లతో జరిగిన వేరు వేరు సమావేశంలో తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ లు) జూన్, జూలై నెలల్లో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తూ, ఓటర్ల వివరాలను సేకరిస్తారని అన్నారు.కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి మ్యాపింగ్ చేయడం జరుగుతోందన్నారు.18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదుతో పాటు ఓటరు కార్డులో పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అన్నారు.
*44 మంది బిఎల్ఓ లు 40758 మంది ఓటర్లు*
మండల వ్యాప్తంగా 44 మంది బిఎల్ఓ లతో 40758 మంది ఓటర్లను ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా పరిశీలించనున్నట్లు తహశీల్దార్ భాగ్యలత తెలిపారు.ఇందులో 20129 మంది పురుషులు,20628 మంది మహిళా ఓటర్లు,ఒకరు ట్రాన్స్ జెండర్ ఓటర్ ఉన్నట్లు తెలిపారు.బిఎల్ఓ లు ప్రతి ఓటరు ఇంటి దగ్గరికి వచ్చి ఓట్లను పరిశీలించాలని ,ప్రతి ఓటరు కి ఎన్యూమరేట్ ఫారం అందజేసయాలని సూచించారు.ఎన్యూమరేషన్ ఫారం లో ఓటర్ తమ పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు.
*ఓటరు మ్యాపింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి*
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా, 2002 ఓటరు జాబితాలోని ఓటర్లను, ప్రస్తుత ఓటరు జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తహశీల్దార్ భాగ్యలత తెలిపారు.2002 ఓటరు జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం కూడా ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.2002 సంవత్సరం తర్వాత 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటరుగా నమోదు అయిన వారు, లేదా వివాహం, వలస, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతంలో ఓటరుగా నమోదు అయిన వారు తమ తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా ఇతర కుటుంబ సభ్యుల 2002 ఓటరు వివరాల ఆధారంగా యాడ్ ప్రొజెన్సీ మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు.2002 ఓటరు జాబితాలో కుటుంబ సభ్యులేవ్వరు నమోదు కాకపోయి, ప్రస్తుతం మాత్రమే ఓటరు హక్కు కలిగి ఉన్న వారు సెల్ఫ్ ప్రొజెన్సీ మ్యాపింగ్ చేసుకోవాలని అన్నారు. ప్రతి ఓటరు తమకు సంబంధించిన మ్యాపింగ్ వివరాలను సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ కు అందించి, మ్యాపింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఆర్ ఐ భవానిశంకర్ రెవెన్యూ శాఖ సిబ్బంది,బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.
